ఈ మాటలు అన్నది గ్రామస్థులు. వివరాల కోసం మిమ్మల్ని మాతో పాటు నంద్యాల తీసుకువెళ్తున్నాను. మొదటిసారి వరద సాయాన్ని సుంకేశుల వైపు పంపిణీ చేశాము కాబట్టి ఈ సారి వ్యతిరేక దిశలో నంద్యాల వైపు వెళ్దాం అని అనుకున్నాము. మా వాహనానికి డి.ఆర్.డి.ఎ. ప్రాజెక్ట్ డైరెక్టర్ టి. రంగయ్య గారు జెండా ఊపాలి. ఆయనతో నాకు పూర్వ పరిచయం ఉంది. పై స్థాయి అధికారుల్లో నిడారంబరంగా, నిష్కల్మషంగా, అహంభావం లేని వారు అరుదుగా కనబడతారు. వీరిలో ఈయన ప్రథములు. ఆయన బంగ్లా వద్ద కార్యక్రమం. నేను, సతీష్ బయట వాహనానికి బ్యానర్లు కట్టించడం లాంటి పనులు చేస్తున్నాము. ఆలస్యం అవుతుండటంతో సాంబ, శ్రీను, నాగేశ్వర రెడ్డి ఆయనతో మాట్లాడుతున్నారు. మేము బయట రెడీ చేసేలోపు మన వాళ్ళు ఆయనకు మనం చేసిన కార్యక్రమం మొత్తం వివరించారు. వాహనాన్ని రెడీ చేశాక ఆయన జెండా ఊపారు. వాహనాలు కదులుతున్నాయి. రంగయ్యగారు " మీ కార్యక్రమం చూస్తుంటే నేనూ మీతో పాటు రావాలి అనిపిస్తోంది. మీరు వెళ్తున్న గ్రామాలకు కూతవేటు దూరంలో మా ఊరు గోస్పాడు ఉంది. ఈ రోజు ఎలాగూ ఆదివారం. అలాగే డి.ఆర్.డి.ఎ. తరఫున 500 జతల బట్టలు ఇవ్వాలని అనుకున్నాము. నేను వస్తే మీకు ఏమైనా అభ్యంతరమా " అని అడిగారు. మేము అందరం సంతోషంతో ఆయన్ను ఆహ్వానించాము.





మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో గోస్పాడు చేరుకున్నాము. రంగయ్య గారి అన్న వాళ్ళ ఇంట్లో భోజనం చేసి పంపిణీకి బయలుదేరాము. రాయపాడు అనే ఊరికి వెళ్ళాలని అనుకుంటున్నాము. బయట మా మాటలు వింటున్న ఒక పెద్దాయన మా దగ్గరకొచ్చి " మాది రాయపాడే, మాకు అవసరం లేదులే సార్! పెద్దగా ఏమీ నష్టపోలేదు. పూర్తిగా నష్టపోయిన వాళ్లకు ఇవ్వండి. మా దగ్గరలోని వూరివాళ్ళు కూడా వరద సాయం చెయ్యడానికి గుండ్రేవుల వెళ్ళి వచ్చారు ( మనం మొదటిసారి వెళ్ళింది, ఇక్కడికి 100 కి.మీ. పైన ఉంది) ఇక్కడ నిజంగా సమస్య ఉంటే వీళ్ళంతా అంత దూరం ఎందుకు వెళ్తారు? మీరు ఎంతో కష్టపడి వచ్చారు " అని అన్నాడు. మేము గందరగోళంలో పడ్డాము. సరే ముందు మనం వెళ్ళి పరిశీలించి వద్దాం అని క్రూయిజర్ లో అందరం వెళ్ళాము. అక్కడ పరిస్తితి సాదాసీదాగా ఉంది. ఊరు మొత్తానికి నీళ్ళు మూకాలి లోపే వచ్చాయట. పెద్దగా వరద ప్రభావం లేదు. దగ్గరలోని కూలూరు, తేళ్ళపురిలో కూడా ఇదే పరిస్థితి అన్నారు. దాంతో మేము వెనుదిరిగాము.



మా విచారణలో లింగాల అనే ఊరు తేలింది. సరే అని మొత్తం పటాలం అంతా అక్కడికి బయలుదేరింది. తీరా వెళ్ళాక అక్కడ జాతర జరుగుతోంది. ఒక స్వచ్చంద సంస్థ ఏవో కిట్స్ ఇస్తోంది. మరో సంస్థ ఊరిలో టోకెన్లు పంచుతోందట. మేము దిగి పరిస్థితిని చూస్తున్నాము. పంచుతున్న సంస్థకు సంబంధించిన వ్యక్తి మాదగ్గరకొచ్చి కొందరిని చాటుగా తీసుకు వెళ్ళాడు. ఆయనతో పాటు నలుగురం గుడిలోకి వెళ్ళాము. " దయచేసి మీరు వెళ్ళిపోండి సార్ ! ఇక్కడ వీళ్ళకు సహాయం అందించడం దండగ. మనమేమీ డబ్బులు ఎక్కడా కొట్టుకు రాలేదు, ఎంతో కష్టపడి సమీకరించుకుని ( అడుక్కుతిని అని ఆయన అక్కసుగా అన్నాడు) వీటిని మోసుకుని దూరం నుంచి వచ్చాము. మేము మోసపోయాము. అందరూ తీసుకుంటున్నవాళ్ళే తీసుకుంటున్నారు " అని చెప్పాడు. అక్కడివాళ్ళను అడిగాము వాస్తవ పరిస్థితి గురించి. వరద ప్రభావం పెద్దగా లేదు అని చెప్పారు. మేము జుట్టు పీక్కున్నాము. మరోవైపు చీకటి పడుతోంది. ఈలోపు పంపిణి చేసి వెనక్కి బయలుదేరాలన్నది మా ప్లాను. అదే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోను పూర్తిగా నష్టపోయిన వారికే మన సాయం అందాలి. రాజీ మాత్రం వద్దు అని అందరూ ముక్తకఠంతో చెప్పారు. సరే ముందు ఇక్కడి నుంచి బయటపడాలని అనుకుని ఊరు వదిలాము.

on
categories: | edit post

2 వ్యాఖ్యలు

  1. మీరొక మంచి పని చేస్తున్నారు, అంచేత విమర్శించడానికి ఇబ్బందిగా ఉంది. కానీ ఇటువంటి సందర్భాల్లో సహాయ కార్యక్రమాలు చేపట్ట దలుచుకున్న సంస్థలకి .. సమర్ధవంతంగా ఆ సహాయం అందించగలిగే శిక్షణ ఉండాలి. అక్కడ ఫీల్డులో నిజంగా ఎక్కడ ఏమి అవసరమో అనే సమాచారం ముందుగానే తెలుసుకుని ఉండాలి.
    ఇదివరలో గుజరాత్ లో పెద్ద భూకంపం వచ్చి, పెద్దయెత్తున వినాశనం జరిగినప్పుడు కూడా .. చాలా మంది కదిలిపోయి సహాయం చెయ్యడానికి దూసుకుని వెళ్ళారు కానీ, ఏ సహాయం ఎలా చెయ్యాలో తెలియక చాలా వనరులు వృధా అయ్యాయి.

    All this is not to detract from your good intentions. It is only to stress the need for correct information and proper planning.

     
  2. jeevani Says:
  3. మీరు చెప్పింది నిజమే! కానీ అసలు పరిస్థితిని మీకు తర్వాతి టపాలో వివరిస్తాను. మేము వెళ్ళిన రోజు మాత్రమే ఆ ఊర్లతో బయటి ప్రపంచానికి సంబంధాలు ఏర్పడ్డాయి.

     

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo